: కోహ్లీ గాయం పెద్దదే... మ్యాచ్ ప్రాముఖ్యతను బట్టి క్రీజులోకి వచ్చాడు!: క్లార్క్
రాంచీ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తగిలిన గాయం చిన్నది కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లర్క్ అన్నాడు. ఢిల్లీలో క్లార్క్ మాట్లాడుతూ, కోహ్లీకి అయిన గాయం పెద్దదేనని, అయితే జట్టు కెప్టెన్ గా ముందుండి నడపాల్సిన బాధ్యత గురించి కోహ్లీకి బాగా తెలుసు కాబట్టి మళ్లీ మైదానంలోకి వచ్చాడని అన్నాడు. నాలుగో టెస్టునాటికి కోహ్లీ పూర్తిగా కోలుకుంటాడని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
సాధారణంగా ఏ ఆటగాడైనా వ్యక్తిగత ప్రయోజనాలకంటే జట్టు ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తాడని క్లార్క్ చెప్పాడు. కోహ్లీ లాంటి నిబద్ధత గల ఆటగాడు గాయాలను లెక్కచేయడని చెప్పాడు. కాగా, కోహ్లీపై ఆసీస్ వెటరన్ లు విమర్శలు గుప్పించిన వేళ క్లార్క్ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 25 నుంచి ధర్మశాల వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.