: మంత్రి ఫోన్ కాల్.. గ్యాంగ్ రేప్ ను అడ్డుకుంది!


నలుగురు వ్యక్తులు తన భార్యపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తున్నారంటూ చేసిన ఫోన్ కాల్ కు సత్వరమే స్పందించిన మంత్రి ఆ గ్యాంగ్ రేప్ ను ఆపేలా చర్యలు తీసుకున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరాఖండ్ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఆర్టీఐ కేసు విచారణ నిమిత్తం ఓ జంట ( భార్యభర్తలు) ఆదివారం రాత్రి డెహ్రాడూన్ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌ ఫర్మేషన్ ఆఫీసుకి వచ్చింది. మరుసటి రోజు దీనిపై విచారణ జరుగుతుందని, మళ్లీ వెళ్లి రావడం ఎందుకుని చెప్పిన డైరెక్టరేట్ ఆఫీసు ఉద్యోగులు ఆ రాత్రికి వారిని అక్కడే ఉండిపోవాలని సలహా ఇచ్చారు.

దీంతో అక్కడే ఉండిపోయిన ఆ దంపతులు రాత్రి 11 గంటల ప్రాంతంలో డిన్నర్ ముగించి నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఇంతలో డైరెక్టరేట్ ఉద్యోగులు ఇద్దరు అక్కడికి వచ్చారు. వారు మరో ఇద్దరికి ఫోన్ చేశారు. నలుగురూ కలిసి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె భర్తపై దాడి చేశారు. దీంతో వెంటనే వారి దురాగతాన్ని బాధితుడు మంత్రి ప్రకాశ్ పంత్ కు ఫోన్ చేసి చెప్పాడు. క్షణం ఆలస్యం చేయని మంత్రి వెంటనే ఎస్ఎస్పీ స్వీటీ అగర్వాల్ కు ఫోన్ చేశారు. తక్షణం వారిని ఆదుకోవాలని సూచించారు.

మంత్రి ఆదేశాలతో స్వీటీ అగర్వాల్ సిబ్బందితో వెంటనే బయల్దేరారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారిపై సెక్షన్ 354 (ఏ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో డైరెక్టరేట్ ఉద్యోగులు జగ్మోహన్ సింగ్ చౌహాన్, అనిల్ రావత్, హరిసింగ్ పెత్వాల్ లు కాగా, నాలుగో వ్యక్తి అదే ప్రాంగణంలో టీ స్టాల్ నడిపే జగదీశ్ సింగ్ అని పోలీసులు తెలిపారు. కాగా, బాధితులకు అండగా ఉంటానని, ఏ క్షణంలోనైనా తనను సంప్రదించవచ్చని మంత్రి ప్రకాశ్ పంత్ తెలిపారు. 

  • Loading...

More Telugu News