: నా చిన్ననాటి హీరోను క్షణం కూడా వదలను!: 'ఐపీఎల్ లో 4 కోట్లు' పలికిన అఫ్ఘాన్ స్పిన్నర్
తన చిన్ననాటి హీరోను క్షణం కూడా వదలకుండా ఉంటానని తాజా ఐపీఎల్ లో 4 కోట్ల రూపాయలకు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కొనుగోలు చేసిన ఆఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ తెలిపాడు. ఐపీఎల్ లో ఆడేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని రషీద్ తెలిపాడు. '40 రోజుల పాటు నా చిన్ననాటి హీరో యువరాజ్ సింగ్ తో కలిసి ప్రయాణిస్తానన్న ఊహే ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని' రషీద్ చెప్పాడు.
యువీ దూకుడంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన రషీద్... ఐపీఎల్ సీజన్ లో తన హీరోతో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతానని అన్నాడు. యువీ నుంచి మెళకువలు నేర్చుకుంటానని చెప్పాడు. దోనీ కూడా తన అభిమాన క్రికెటర్ అని చెప్పిన రషీద్... ఐపీఎల్ లో డబ్బుల గురించి ఏమీ ఆలోచించలేదని, అయితే టోర్నీ ముగిసిన తరువాత ఇంటికెళ్లి తీరిగ్గా ఆ డబ్బులు ఏం చేయాలా? అని ఆలోచిస్తానని రషీద్ తెలిపాడు. కాగా, ప్రపంచ నెంబర్ వన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఉత్సాహం చూపని ఫ్రాంఛైజీలు రషీద్ ను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపడం విశేషం.