: కపిల్! ఆడవాళ్ల ముందు అసభ్యంగా మాట్లాడడం మానుకో: సునిల్ గ్రోవర్ రిటార్ట్
కామెడీ నైట్ విత్ కపిల్ శర్మ షోతో హిందీ టీవీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగిన కపిల్ శర్మకు సహచరుడు సునీల్ గ్రోవర్ రిటార్ట్ ఇచ్చాడు. విమానంలో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన సునీల్ గ్రోవర్ ఇప్పుడు మెత్తగా మొత్తాడు. తన ట్విట్టర్ లో సునీల్ గ్రోవర్ కపిల్ కు సూచనలు ఇస్తూ.... ‘కపిల్! నువ్వు నన్ను చాలా బాధపెట్టావు. నీతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎంతో నేర్చుకున్నాను. అందుకే నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. కేవలం జంతువులను మాత్రమే కాకుండా మనుషులను కూడా గౌరవించు. ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో అందరూ నీ అంత సక్సెస్ అయినవారు కాదు. నీ అంత టాలెంట్ ఉన్న వారు కూడా కాదు. ఇకపోతే, అంతా నీ అంత టాలెంటెడ్ అయివుంటే ఇతరులు నీకు మాత్రమే ఎందుకు విలువిస్తారు? అయితే వారికి కూడా నీలాగే టాలెంట్ ఉంది. కాబట్టి ఇతరులపై కాస్త కృతజ్ఞత చూపించు. నీ తప్పును ఎవరైనా సరిచేస్తే వారిని తిట్టకు. మరీ ముఖ్యంగా వారిని ఆడవారి ముందు అసభ్యకరంగా మాట్లాడడం మానుకో. నీ స్టార్ డమ్ తో వారికొచ్చిన ఇబ్బందేమీ లేదు.
అయితే బై ఛాన్స్ వాళ్లంతా నీతో పాటు జీవితంలో ప్రయాణిస్తున్నవారు మాత్రమే. ‘ది కపిల్ శర్మ షో’ నీ కార్యక్రమం అని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఆ షో నుంచి నీకు నచ్చకపోతే ఎవరినైనా వెళ్లగొట్టే హక్కు నీకుందని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. నువ్వు ఎంచుకున్న రంగంలో చాలా బాగా ఎదిగావు. మంచిదే...కానీ దేవుడిలా నటించకు. నీ గురించి నువ్వు కేర్ తీసుకో. నీకు జీవితంలో మరింత సక్సెస్, పేరు రావాలని ఆశిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇకపై కపిల్ శర్మతో సునీల్ గ్రోవర్ పని చేసే అవకాశం లేదని హిందీ బుల్లితెర నటులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో సునీల్ గ్రోవర్ ఒకసారి ఈ షో నుంచి వెళ్లిపోగా, రేటింగ్స్ బాగా పడిపోయి, కపిల్ క్రేజ్ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల అభిమానులు కపిల్ పై మండిపడుతున్నారు. డబ్బుతెచ్చిన మదంతో కపిల్ ఇలా వ్యవహరిస్తున్నాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.
From a friend, with love @KapilSharmaK9 pic.twitter.com/2c7uQ5jqH5
— Sunil Grover (@WhoSunilGrover) March 21, 2017