: తెలంగాణలో మా పార్టీ నుంచే బాహుబలి వస్తారు: ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కూడా తన మాటల్లో బాహుబలి ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, తెలంగాణలో తమ పార్టీ నుంచే బాహుబలి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మతపరమైన రాజకీయాలకు చరమగీతం పాడాలని ఆయన అన్నారు. తెలంగాణలోని విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకొస్తామనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగాక, ఈరోజు జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌కు ఆమోదముద్ర వేస్తారని వార్తలు వస్తున్నాయని, ఇది సరికాదని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ముస్లింల 4 శాతం రిజర్వేషన్ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ అంశంపై రాష్ట్రంతో జాతీయస్థాయిలో తమ పార్టీ పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు.