: భారతావనిలో తొలి జీవి గంగానది... మానవ హక్కులన్నీ కల్పిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు చారిత్రక ఆదేశాలు
ఎన్నో యుగాలుగా ప్రవహిస్తూ, అన్ని పురాణాల్లో స్థానం సంపాదించుకుని, ఇండియాలోని అతిపెద్ద నదులలో ఓకటిగా, పరమ పవిత్రమని పేరు తెచ్చుకున్న గంగానదిపై ఉత్తరాఖండ్ హైకోర్టు చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. ఇండియాలో తొలి జీవిగా గంగానదిని గుర్తిస్తున్నామని ప్రకటించింది. మానవులకు ఉన్న అన్ని హక్కులూ ఇకపై గంగానదికి కూడా ఉంటాయని స్పష్టం చేసింది. గంగానదికి ఉపనదిగా ఉన్న యమునకు కూడా ఇదే విధమైన హక్కులు వర్తిస్తాయని పేర్కొంది.
ఇకపై ఎవరైనా గంగానదిని కలుషితం చేస్తే, సాటి మానవుడి హక్కులకు భంగం కలిగిస్తే, ఐపీసీ కింద పెట్టే కేసులనే నమోదు చేయాలని ఆదేశించింది. నదిని మరింత శుచిగా చేసేందుకు ప్రభుత్వం గంగా అడ్మినిస్ట్రేషన్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. భావి తరాలకు ఈ జీవనదిని అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత వారంలో న్యూజిలాండ్ లో సైతం ఓ కోర్టు ఇదే విధమైన తీర్పు ఇచ్చింది. 145 కిలోమీటర్లు పారుతున్న వాంగనూయ్ నదిని ఓ జీవిగా ప్రకటిస్తూ తీర్పివ్వగా, ప్రపంచంలో ఈ హోదాను దక్కించుకున్న తొలి నదిగా వాంగనూయ్ నిలిచింది. ఇప్పుడు గంగ, యమునలకూ ఇదే హోదా దక్కడం విశేషం.