: కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి తొలి పరాభవం.. బీటలువారిన 40 ఏళ్ల కంచుకోట


కడప జిల్లా అంటేనే వైయస్ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హయాం నుంచి ఆ జిల్లాపై ఆ కుటుంబానిది ఓ చెరగని ముద్ర. రాజారెడ్డి మరణం తర్వాత వైయస్ తన కుటుంబ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆయన తర్వాత ప్రస్తుతం జగన్ కూడా జిల్లాపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కానీ, జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.

గత 40 ఏళ్లుగా వైయస్ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి కూడా జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలు కాలేదు. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఆ ఎలక్షన్ కడప జిల్లాకు చెందినది కాకపోవడంతో దాన్ని పట్టించుకోనవసరం లేదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికలో వైసీపీ తరపున విజయమ్మ పోటీ చేశారు. ఆమెపై వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో విజయమ్మ ఘనవిజయం సాధించగా... వివేకా డిపాజిట్ దక్కించుకున్నారు. అయితే, వివేకా ఓటమిపాలైనప్పటికీ... ఆయన ఓడిపోయింది విజయమ్మ మీదే కాబట్టి, ఆ ఓటమిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

కానీ, ఇప్పుడు తొలిసారి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో వివేకానందరెడ్డి ఓడిపోవడం... వైయస్ కుటుంబానికి కడప జిల్లాలో తొలి ఓటమిగా చెప్పుకోవచ్చు. ఈ ఓటమితో 40 ఏళ్ల వైయస్ కంచుకోట బీటలు వారిందని ప్రత్యర్థులు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గం, సొంత మండలమైన సింహాద్రిపురం నుంచే బీటెక్ రవి పోటీ చేసి గెలుపొందారు. దీంతో, మండలంలోను, నియోజకవర్గంలోను, జిల్లాలోను వైసీపీ ఆత్మస్థైర్యాన్ని బీటెక్ రవి దెబ్బతీసినట్టైంది. 

  • Loading...

More Telugu News