: తాను చెప్పిన యువకుడిని పెళ్లి చేసుకోలేదన్న పగతో స్నేహితురాలిని చంపేసిన యువతి!


తాను చెప్పిన యువకుడిని పెళ్లి చేసుకోలేదన్న ఆగ్రహంతో తన స్నేహితురాలిని ఓ యువతి హత్య చేసిన‌ ఘటన పంజాబ్‌లోని పానిపట్ మోడల్ టౌన్ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మీనా, కోమల్ అనే ఇద్ద‌రు అమ్మాయిలు చిన్ననాటి నుంచి క‌లిసిమెల‌సి పెరిగారు. ఒక‌రికొక‌రు మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ గ‌డిపేవారు. వారిద్దరి స్నేహాన్ని చూసి వారి గ్రామ‌మంతా ముచ్చ‌ట‌ప‌డేది. వారిద్ద‌రూ ఒకే కళాశాలలో చ‌దివి గ‌తేడాది ఇద్దరూ డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే, నెల‌రోజుల క్రితం కోమల్‌కు ఓ యువకుడితో వివాహమైంది. అయితే, తాను చెప్పిన యువకుడిని కాకుండా త‌న స్నేహితురాలు మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కోమల్‌పై మీనా పగ పెంచుకుంది.

దీంతో కోమల్‌కు పార్టీ ఇస్తానని ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఆమెను మీనా తీసుకెళ్లింది. అయితే, కోమ‌ల్ కుటుంబ స‌భ్యుల‌కు పెను విషాద వార్త అందింది. అదే రోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో కోమల్ సోదరుడికి మీనా ఫోన్ చేసి ఆమె విషాహారం తీసుకుందని చెప్పింది. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న కోమల్ సోదరుడు ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేకుండా పోయింది. అప్ప‌టికే కోమల్ మృతి చెందిందని వైద్యులు చెప్ప‌డంతో కోమ‌ల్ కుటుంబ స‌భ్యులు విషాదంలో మునిగిపోయారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిజానిజాల‌ను బ‌య‌ట‌కు లాగారు. తాను చెప్పిన యువకుడిని పెళ్లి చేసుకోలేదనే కోపంతో మీనానే కోమల్‌ను చంపినట్లు తేల్చారు. అయితే, అప్ప‌టికే మీనా ఎక్క‌డికో పారిపోయింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News