: గణనీయంగా సంపద సృష్టి... ఇండియాలో సెంచరీ దాటిన బిలియనీర్ల సంఖ్య
ఇండియాలో సంపద సృష్టి గణనీయంగా పెరిగిందన్న సంకేతాలను చూపుతూ, ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్న భారతీయుల సంఖ్య సెంచరీ దాటింది. ఈ సంవత్సరం జాబితాలో బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,538 కోట్లు) కన్నా అధిక సంపద ఉన్నవారి సంఖ్య 101కి చేరింది. ఎప్పటిలానే ఈ జాబితాలో ముఖేష్ అంబానీ టాప్ లో నిలువగా, అత్యధిక బిలియనీర్లను కలిగున్న దేశాల జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 565 మంది బిలియనీర్లతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 319 మందితో చైనా, 114 మందితో జర్మనీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ముఖేష్ అంబానీ 23.2 బి. డాలర్ల సంపదతో ప్రపంచస్థాయిలో 33వ స్థానంలోను, ఇండియాలో మొదటి స్థానంలోను నిలిచారు. ఆయన సోదరుడు అనిల్ అంబానీకి 745వ స్థానం లభించింది. అనిల్ ఆస్తుల విలువ 2.7 బి.డాలర్లని ఫోర్బ్స్ పేర్కొంది. ఆర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ 16.4 బి.డాలర్ల ఆస్తితో 56వ స్థానంలో నిలిచారు. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ 72వ స్థానంలో, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ 250వ స్థానంలో, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ 544వ స్థానంలో, ఇన్వెస్టర్ రాఖేష్ ఝున్ ఝున్ వాలా 939వ స్థానంలో, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 1161వ స్థానంలో, మరో సహవ్యవస్థాపకుడు నందన్ నిలేకని 1290వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా 1567వ స్థానంలో, యస్ బ్యాంకు హెడ్ రానా కపూర్ 1795వ స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో తొలిసారిగా స్థానం సంపాదించుకున్న బాబా రాందేవ్ స్నేహితుడు ఆచార్య బాలకృష్ణ 2.5 బి. డాలర్ల ఆస్తితో 814వ స్థానంలో నిలిచారు. ఇక విదేశాల్లో ఉన్న భారత సంతతి వ్యక్తుల్లో, హిందుజా సోదరులు 15.4 బి. డాలర్ల ఆస్తితో 64వ స్థానంలో, పల్లోంజీ మిస్త్రీ 14.3 బి. డాలర్లతో 77వ స్థానంలో, శ్రీ ప్రకాష్ లోహియా 5.4 బి. డాలర్ల ఆస్తితో 288వ స్థానంలో నిలిచారు.