: భారీగా పడిపోయిన డొనాల్డ్ ట్రంప్ ర్యాంక్... తాజా కుబేరుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్, బిలియనీర్ల జాబితాను విడుదల చేయగా, ఎప్పటిలానే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 2000 మంది బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాంకు గత సంవత్సరంతో పోలిస్తే 200 స్థానాలకు పైగా పడిపోవడం గమనార్హం.
మొత్తం 86 బిలియన్ డాలర్ల ఆస్తులతో వరుసగా నాలుగో సంవత్సరం, గత 23 ఏళ్లలో 18వ సారి గేట్స్ తొలి స్థానంలో నిలువగా, ఆ తరువాత బెర్క్ షైర్ హాత్ వే చీఫ్ వారెన్ బఫెట్ 75.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. 2016తో పోలిస్తే బఫెట్ ఆస్తి విలువ ఏకంగా 14.8 బి. డాలర్లు పెరగడం గమనార్హం. వీరిద్దరి తరువాత అమేజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లీసన్ ఉన్నారు.
మొత్తం 183 మంది టెక్ బిలియనీర్లు ఉన్నారని, వారి ఆస్తి విలువ ట్రిలియన్ డాలర్లకన్నా ఎక్కువేనని పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య 13 శాతం పెరిగి 2,043కు చేరిందని, గత 31 సంవత్సరాల్లో ఇంత భారీగా సంపద సృష్టి జరగలేదని తెలిపింది. ఇక ట్రంప్ విషయానికి వస్తే, గత సంవత్సరంతో పోలిస్తే ఆయన ర్యాంకు 324 నుంచి 544కు పడిపోయింది. ఆయన తాజా సంపద సుమారు 3.5 బి. డాలర్లని ఫోర్బ్స్ లెక్కించింది. ఆయన సుమారు 66 మిలియన్ డాలర్లను రాజకీయాల కోసం, ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేశారని, కోర్టు కేసుల పరిష్కారం కోసం మరో 25 మిలియన్లు వెచ్చించారని తెలిపింది.
ఇక ఈ జాబితా టాప్ 10లో స్పెయిన్ కు చెందిన అపెరల్ చైన్ జారా వ్యవస్థాపకురాలు అమానికో ఓర్టెగా, మెక్సికన్ టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్, అమెరికా కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్తలు చార్లెస్, డేవిడ్ సోదరులు, న్యూయార్క్ నగర మేయర్, బ్లూమ్ బర్గ్ న్యూస్ ఏజన్సీ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్లూమ్ బర్గ్ ఉన్నారు. ఈ జాబితాలో 227 మంది మహిళలకు స్థానం లభించింది. ఇతర ప్రముఖుల్లో అలీబాబా ఫౌండర్ జాక్ మా (23వ స్థానం), ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ (215వ స్థానం), హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్ బర్గ్ (501వ స్థానం), ఓప్రా విన్ ఫ్రే (660వ స్థానం) తదితరులు ఉన్నారు.