: వైఎస్ బ్రాండ్ పడిపోయింది.. 2019లో కాదు, 2024 ఎన్నికల్లో ప్రయత్నించండి: కడప టీడీపీ


40 ఏళ్ల వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టామని కడప టీడీపీ నేతలు విజయానందాన్ని వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా మాకు తిరుగే లేదు... మమ్మల్ని ఎవరూ ఓడించలేరు... మా కంచుకోటలో ఎవరూ అడుగుపెట్టలేరని విర్రవీగిన వైఎస్ కుటుంబానికి షాక్ ఇచ్చామని చెప్పారు. జిల్లాలో వైసీపీ ఉనికిని కోల్పోయిందని... మళ్లీ ఉనికిని చాటుకోవడానికి 2019 ఎన్నికల్లో కాకుండా, 2024 ఎన్నికల్లో ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి గెలుపొందడంలో... కడప జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.

వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడంతో పార్టీ సంబరాలు అంబరాన్ని అంటాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో వైసీపీ పతనం ప్రారంభమయిందని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేసేందుకు వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకరని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరిగిన ఎన్నికలు అని అన్నారు. చంద్రబాబు నీతివంతమైన, స్వచ్ఛమైన పాలనకు ఈ ఫలితం ఓ నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు స్ఫూర్తితో జిల్లాలోని టీడీపీ నాయకులంతా కలసికట్టుగా పని చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News