: నన్ను కొంత మంది కావాలనే అణగదొక్కుతున్నారు: శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆరోపణలు
కొంత మంది తనను కావాలనే అణగదొక్కుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎంపీ జితేందర్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకున్నారని, అసలు ఎన్నికల్లోనే తనను ఓడించాలని చూశారని ఆయన చెప్పారు. లక్ష్మారెడ్డికే ఇవ్వాలని ఆయన పట్టుబట్టడంతోనే ఆయనకు మంత్రి పదవి దక్కిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అయినా కూడా తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు విధేయుడిగా ఉంటానని ఆయన చెప్పారు. ఆయన ఏ పని చెప్పినా చిత్తశుద్ధితో చేస్తానని ఆయన అన్నారు. ఇలాగే కొనసాగితే మహబూబ్ నగర్ జిల్లాలోని 50 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలే తనకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈసారి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో తనకు పదవి దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పేద రెడ్లు, మధ్యతరగతి వారు తనకు అండగా ఉన్నారని ఆయన చెప్పారు.