: రోజా రాజకీయ భవిష్యత్తును జగన్ నాశనం చేస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్యే అనిత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇటీవల మాట్లాడుతూ తన రాజకీయ జీవితాన్ని టీడీపీ నాశనం చేయాలని చూస్తోందని వ్యాఖ్యానించారని, అయితే, ఆమె రాజకీయ భవిష్యత్తును జగన్మోహన్‌రెడ్డే నాశనం చేస్తున్నారని ఎమ్మెల్యే అనిత అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... రోజా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నది జగన్మోహన్‌రెడ్డేనని అన్నారు. ఎందుకంటే ఆమె క్షమాపణలు చెప్పకుండా జగన్ అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ కారణంగానే ఆమెకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. రోజాని అసెంబ్లీకి రానివ్వకపోతే దానినే ఇష్యూ చేసి, ఆ సింపతీని కొట్టేయాలని వైసీపీ భావిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. రోజాను టార్గెట్ చేయాల్సి న అవసరం టీడీపీకి లేదని చెప్పారు.
గత ఏడాది ఆగస్టులో క్షమాపణలు చెబుతామని రోజా చెప్పారని, ఇప్పుడు మాత్రం చెప్పనంటూ మాటమార్చుతున్నారని అనిత అన్నారు. రోజా తనకిచ్చిన సీడీ ఒరిజినల్ కాదని కూడా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. సీడీ విషయంలో ఆ ఆరోపణలు చేయడానికి రోజాకి సంవత్సరం సమయం పట్టిందా? అని ఆమె ప్రశ్నించారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేకి క్షమాపణలు చెప్పడానికి రోజా ఎందుకు ఒప్పుకోవడం లేదని ఆమె అన్నారు. అప్పట్లో అన్ కండిషనల్ క్షమాపణ చెబుతానని రోజా ఎందుకు అన్నారని ఆమె ప్రశ్నించారు. రోజాకి, తనకి మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని ఆమె చెప్పారు.