: గొడవపడ్డాం నిజమే...మేము సర్దుకుంటాం...సునీల్ పాజీ అంటే నాకు చాలా గౌరవం!: కపిల్ శర్మ


హిందీ టీవీ కామెడీ నటులు కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్ మధ్య విమానంలో చోటుచేసుకున్న వివాదం బాలీవుడ్ లో పెను కలకలం రేపింది. దీనిపై వివిధ ఛానెళ్లలో కథనాలు వెల్లువెత్తడంతో కపిల్ శర్మ స్పందించాడు. ఫేస్ బుక్ లో జరిగిన వివాదం గురించి ప్రస్తావిస్తూ, మీడియాపై మండిపడ్డాడు. ఈ మేరకు ఫేస్ బుక్ లో రాస్తూ, "ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?. ఏ ఉద్దేశంతో వీటిని సృష్టిస్తున్నారు? ఒకవేళ నేను విమానంలో సునీల్‌ ని కొట్టి ఉంటే అది ఎవరు మీకు చెప్పారు? అలా చెబితే నమ్మేస్తారా? కొందరికి ఇలాంటి పుకార్లంటే చాలా ఇష్టం. మేము కలిసి తింటాం, కలిసి ప్రయాణిస్తాం, ముఖ్యంగా సునీల్‌ పాజీ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.

నిజమే, ఆయనతో నేను గొడవపడ్డా. మేము కూడా మనుషులమే కదా? ఐదేళ్లలో తొలిసారి నేను ఆయనపై అరిచాను. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ఈ విషయాన్ని మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటాం. అంతమాత్రాన తప్పుడు ప్రచారాలు చేేయాలా? సునీల్‌ నాకు అన్నయ్య లాంటి వాడు. నాకు మీడియాపై గౌరవం ఉంది. ఈ సమస్య కంటే చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ దీనిని వివాదం చేయడం దారుణం. ఇది మా కుటుంబ సమస్య, దీనిని మేమే పరిష్కరించుకుంటాం" అని కపిల్ శర్మ స్పష్టం చేశాడు.

 కాగా, దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంపాదించాక కపిల్ కు గర్వం తలకెక్కిందని పేర్కొంటున్నారు. ముందు సునీల్ గ్రోవర్ కు క్షమాపణలు చెప్పాలని సూచించారు. సునీల్ గ్రోవర్ లేకపోతే ఆ షో ఏం అవుతుందో గతంలో ఓసారి అనుభవంలోకి వచ్చిన విషయం గుర్తు చేసుకోవాలని వారు సూచించారు. సునీల్ లేకపోతే కపిల్ శర్మ షోకి ఆదరణ ఉండదని తేల్చిచెప్పారు. సుమోనా చక్రవర్తి లేకుండా నిన్ను చూడడం చిరాగ్గా ఉందని, సునీల్ గ్రోవర్ కూడా లేకపోతే నీ షోకు దిక్కు ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News