: ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఒక్కొక్కరిని 20 నుంచి 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు: జగన్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. ఈ రోజు శాసనసభ వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఈ గెలుపును చంద్రబాబు విజయంగా భావిస్తే, పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. ఆ ఎన్నికల ఫలితాలను తాము రెఫరెండంగా స్వీకరిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఒక్కొక్కరిని 20 నుంచి 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన అన్నారు. అక్రమమార్గాల్లో వెళ్లే చంద్రబాబుకి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.