: డ్రా దిశగా మూడో టెస్టు... జాగ్రత్తగా ఆడుతున్న ఆసీస్
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఐదో రోజు చివరి సెషన్ లో భారత బౌలర్లను ఆసీస్ బ్యాట్స్ మెన్ షాన్ మార్ష్ (66), హ్యాండ్స్ కోంబ్ (53) సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఊరించే బంతులతో భారత బౌలర్లు ఎంత కవ్వించినా దూకుడు పెంచని ఆసీస్ బ్యాట్స్ మెన్ మ్యాచ్ ను డ్రా దిశగా నడిపిస్తున్నారు. భారత బౌలర్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆసీస్ బ్యాట్స్ మెన్ జాగ్రత్తగా ఆడుతుండగా... వారిని పెవిలియన్ కు పంపడమే లక్ష్యంగా బౌలర్లు బంతులు విసురుతున్నారు.
ఈ నేపథ్యంలో పరుగులు రావడం గగనమైనా రెండు జట్ల ఆటగాళ్లు తమ నిబద్ధతను చాటుకున్నారు. అయితే షాన్ మార్ష్ ను జడేజా పెవిలియన్ కు పంపడంతో మరోసారి భారత్ పట్టుబిగించే ప్రయత్నం చేస్తోంది. క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో మ్యాక్స్ వెల్ (4) జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో 93 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా, ఇషాంత్ ఒక వికెట్ తీశాడు.