: ఖర్చు పెట్టకపోయినా పెట్టేసినట్లు చూపిస్తున్నారు: అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వంపై జగన్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించిన అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా పెట్టేసినట్లు చూపిస్తోందని జగన్ అన్నారు. గతంలోనూ చంద్రబాబు ఎల్లంపల్లి విషయంలో సభను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఇప్పుడు కూడా ఎన్నో అంశాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అన్నీ తప్పుడు లెక్కలు చూపుతున్నారని అన్నారు. అసలు తప్పుడు లెక్కలు చూపించడం చంద్రబాబుకి అలవాటేనని జగన్ వ్యాఖ్యానించారు.
సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఏది తీసుకున్నా అన్ని విషయాల్లోనూ అసత్యాలే పలికారని జగన్ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు కూడా వెయ్యి కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో 338 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. గత ఏడాది బడ్జెట్ లో చేసిన కేటాయింపులకు, ఖర్చులకు అసలు పొంతనే లేదని అన్నారు. రెయిన్ గన్స్‌కు కూడా కేవలం రూ.12 కోట్లే ఖర్చు పెట్టి ఎక్కువగా చూపించారని జగన్ విమర్శించారు.