: నాలుగు వికెట్లు కోల్పోయి స్కోరు సమం చేసిన ఆస్ట్రేలియా
జార్ఖండ్ లోని రాంచీ వేదికగా జరుగుతున్న బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు భారత్ స్కోరును సమం చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులకు ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా జట్టు చివరి రోజు చివరి సెషన్ ఆటలో ప్రవేశించేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో చేసిన 603 పరుగుల స్కోరును సమం చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను రవీంద్ర జడేజా ఆత్మరక్షణలో పడేశాడు. బంతిని అద్భుతంగా గింగిరాలు తిప్పిన జడేజా మూడు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.
జడేజా విజృంభణతో వార్నర్ (14), స్మిత్ (21), లియాన్ (2)ల వికెట్లను ఆసీస్ త్వరగానే కోల్పోయింది. రెన్షా (15)ను ఇషాంత్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం షాన్ మార్ష్ (39), హ్యాండ్స్ కోంబ్ (45) అద్భుతంగా టీమిండియా బౌలర్లను ఎదుర్కొన్నారు. కోహ్లీ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా వీరి జోడీని విడదీయలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 71.3 ఓవర్లలో 152 పరుగులు చేసింది. దీంతో భారత్ స్కోరును ఆసీస్ సమం చేసింది. కాగా, అంతకు ముందుకు 32 బంతులాడిన వీరిద్దరూ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయడం విశేషం.