: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే.. ఇక పరీక్ష రాయాల్సి ఉంటుంది!
హైదరాబాదులో ఈ ఏడాది ఇప్పటి వరకు 40 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రూ. 60 లక్షల వరకు చలానాలు విధించారు. అయినా, జనాల్లో మార్పు రావడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి ట్రాఫిక్ శిక్షణా కేంద్రాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కౌన్సిలింగ్ లో అరగంటసేపు పోలీసు అధికారులు పలు సూచనలు చేస్తారు. అంతేకాదు, మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల గురించి వీడియో ద్వారా వివరిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి ఆన్ లైన్ పరీక్షను కూడా పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత, ఆన్ లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పత్రంలో 10 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో కనీసం 7 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే, వారి వాహనాన్ని తిరిగి ఇస్తారు. లేకపోతే, మళ్లీ కౌన్సిలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్ లను వినియోగించనున్నారు.