: అప్పుడు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేసిందేమిటి?*: బీజేపీపై శివసేన ధ్వజం
బీజేపీపై శివసేన ధ్వజమెత్తింది. ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. 2014లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రులను నియమించే విధానం బీజేపీలో లేదని చెప్పిన ఆ పార్టీ... ఇప్పుడు యూపీలో డిప్యూటీ సీఎంలను ఎలా నియమించిందని ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ లో పీడీపీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బీజేపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకుందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రుల విషయంలో బీజేపీ తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గోవాలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా తాత్కాలికమైనదే అని చెప్పారు. గోవా ప్రభుత్వం ఒక అవినీతి కూటమి అని... వాస్తవానికి బీజేపీని గోవా ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.