: భర్తను హత్యచేసిన మహిళ.. ఆపై సూట్‌కేస్‌లో కుక్కి.. బీఎండబ్ల్యూలో తరలింపు!
పంజాబ్‌లో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఆ రాష్ట్రంలోని మొహాలీలో పార్కు చేసిన బీఎండబ్ల్యూ కారు వెనుక సీటులో ఓ సూట్‌కేసు అనుమానాస్పదంగా కనిపించింది. ఈ సూట్‌కేసును గమనించిన రిక్షా కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతుండగా ఈ కేసుకు సంబంధించిన నిందితురాలు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. ఆ సూట్‌కేసులో ఉన్నది తన భర్తేనని, ఆయనను కాల్చిచంపి, అనంతరం ఆయన మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి, బీఎండబ్ల్యూ కారులో వదిలేశానని ఒప్పుకుంది.
నిందితురాలి పేరు సీరత్ ధిల్లాన్ అని, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆమె భర్త ఏకంసింగ్ ధిల్లాన్ అని పోలీసులు తెలిపారు. నిందితురాలి తల్లి జస్విందర్ కౌర్, సోదరుడు వినయ్‌ప్రతాప్ సింగ్ బ్రార్‌లపై కూడా మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడని పోలీసులు చెప్పారు. కారులో ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి కాలువలో పడేయాలని భావించారని, అయితే, ఆ కారు తాళాలు సమయానికి లేకపోవడంతో ఉదయాన్నే మృతదేహాన్ని తీసుకెళదామనుకున్నారని, అయితే ఇంతలోనే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు చెప్పారు. అయితే, ఆ హత్య ఎందుకు చేశారన్న విషయంపై ఇంకా వివరాలు అందలేదు.