: మంచిపనులు చేస్తున్నంత కాలం నేనే సీఎం: చంద్రబాబు
సీఎంగా, ప్రతిపక్ష నేతగా తనకే ఎక్కువ కాలం అవకాశం దొరికిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ... విపక్ష నేతలు తాము ఏ పని చేసినా విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. తాను విపక్షాల కోసం పనిచేయడం లేదని, ప్రజల కోసం పనిచేస్తున్నానని అన్నారు. ఏపీ భవిష్యత్ కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. మంచి పనులు చేస్తున్నంత కాలం తానే సీఎంగా ఉంటానని చెప్పారు. తాను నిత్య విద్యార్థినని అన్నారు. అన్ని అంశాలను స్టడీ చేసి రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు దూసుకువెళుతున్నామని అన్నారు. దేశంలో రెండేళ్లుగా రెండంకెల జీడీపీ సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అన్నారు. మూడేళ్ల సగటు చూస్తే 10.36 గా ఉందని అన్నారు. ఎమ్మెల్యేలు అంటే మైకులు విరిచేయడం, పోడియం వద్దకు దూసుకెళ్లడం, స్పీకర్‌పై దాడి చేయడం కాదని ఆయన అన్నారు. తాను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటువంటి పనులు చేయలేదని అన్నారు.