: ఉబెర్ లో ముదిరిన సంక్షోభం... గుడ్ బై చెప్పిన ప్రెసిడెంట్
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ లో కొనసాగుతున్న సంక్షోభం మరింతగా ముదిరింది. సంస్థపై కోలుకోలేని దెబ్బపడింది. ఉబెర్ ప్రెసిడెంట్, జెఫ్ జోన్స్, తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఆయన ఆరు నెలల క్రితమే ఉబెర్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఎందుకు కంపెనీని వీడాల్సి వచ్చిందన్న విషయమై ఉబెర్ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. జెఫ్ తరువాత ప్రెసిడెంట్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న విషయంపైనా సమాచారం తెలియాల్సి వుంది.
గత సంవత్సరం ఆగస్టులో ఉబెర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జెఫ్, అదనంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీ లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఉన్నతోద్యోగుల్లో ఒకరైన అమిత్ సింఘాల్ ను రాజీనామా చేసి వెళ్లాలని కూడా ఆయన కోరారు. అటువంటిది ఇప్పుడు ఆయనే రాజీనామా చేయడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో ఉబెర్ గ్రోత్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఈద్ బేకర్, సెక్యూరిటీ రీసెర్చర్ చార్లీ మిల్లెల్ లు సైతం రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.