: ఈ సంవత్సరం హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేయబోము!: ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం!
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాలను ఆఫర్ చేస్తూ, ఈ సంవత్సరం అమెరికాకు కొత్తగా ఎవరినీ పంపరాదని, జూనియర్ ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలకు దరఖాస్తులు చేయరాదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వీసా నిబంధనలను కఠినం చేస్తూ, అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణం. డొనాల్డ్ ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక, ఐటీ కంపెనీలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని వివిధ ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకోగా, కనీసం నాలుగేళ్ల పాటు అనుభవం లేనిదే వర్క్ వీసాలకు దరఖాస్తు చేయరాదని ఇన్ఫీ నిర్ణయించింది. ఇకపై ఇండియాలోనే ఎక్కువ పని ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఇతర దేశాల వ్యాపారాలను సైతం ఇక్కడికే తీసుకువచ్చేందుకు క్లయింట్లతో చర్చలు జరుపుతున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. సిస్టమ్స్ ఇంజనీర్స్, సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కు వీసాలు కావాలని ఈ సంవత్సరం దరఖాస్తులు చేయబోవడం లేదని మరో ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. సంస్థ నిర్ణయంతో ఇన్ఫీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.