: పెరూలో వర్ష బీభత్సం.. 72 మంది మృతి.. 800 నగరాల్లో ఎమర్జెన్సీ
పెరూలో ఎల్‌నినో ప్రభావంతో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు 72 మంది మృతి చెందినట్టు ప్రధాని ఫెర్నాండో జవాల ప్రకటించారు. దేశంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వరదల కారణంగా దేశంలోని 811 నగరాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. దేశ రాజధాని లీమాకు వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం దేశంలో 1998 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, అప్పట్లో 374 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. భారీ వర్షాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.