: తిరుపతిలో పట్టాలు తప్పిన కరీంనగర్ ఎక్స్ ప్రెస్ రైలు
తిరుపతి యార్డు లైన్ లో రెండునెలల వ్యవధిలో మరో రైలు పట్టాలుతప్పింది. జనవరిలో రాయలసీమ ఎక్స్ ప్రెస్, వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ లు పట్టాలు తప్పిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి కరీంనగర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో రైల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలును ప్రధాన ట్రాక్ పైకి తెస్తుండగా, ఇంజన్ నుంచి మూడవ బోగీ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పట్టాలపై ఉన్న సిమెంట్ దిమ్మెలు ధ్వంసం కాగా, రైలు బోగీ బ్యాటరీ బాక్సులు ధ్వంసం అయ్యాయి. పట్టాలు సైతం కొంత మేరకు దెబ్బతిన్నాయి. మొత్తం రూ. 25 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. యార్డులో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.