: పొరపాటున మేమా పని చేసి ఉంటే రాష్ట్రం గంగలో కలిసేది..!: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పొరపాటున కాంగ్రెస్లో కలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రం గంగలో కలిసిపోయేదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శనివారం కార్యకర్తల సమావేశాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం కాకపోవడమే మంచిది అయిందన్నారు. ఒకవేళ పొరపాటున ఆ పనిచేసుంటే రాష్ట్రం గంగలో కలిసి ఉండేదన్నారు. కాంగ్రెస్ దేశంలోనే దరిద్రమైన పార్టీ అని అభివర్ణించారు. ఆ పార్టీ నేతలు సిగ్గు విడిచి నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఆ పార్టీలో చింత చచ్చినా పులుపు చావలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తేసి అమరావతిలో పడ్డారని, తెలంగాణలో టీడీపీ ఖేల్ ఖతం, దుకాణం బంద్ అని కేటీఆర్ పేర్కొన్నారు.