: అజయ్ మోహన్ బిస్త్ అనే సైన్స్ గ్రాడ్యుయేట్ ఆదిత్యనాథ్ గా ఎలా మారారంటే..!
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్... ఆ పట్టణంలో 52 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఉన్న గోరఖ్ నాథ్ మఠం, ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధమైనది. ఈ మఠానికి అధిపతులుగా ఉన్నవారు ఎన్నో దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో తమ సత్తాను చాటుతూనే ఉన్నారు. తాజాగా మఠాధిపతి ఆదిత్యనాథ్ ఏకంగా యూపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ బిస్త్. 1992 ప్రాంతంలో గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఉన్న అవైద్యనాథ్ తన సొంత గ్రామం నుంచి అజయ్ మోహన్ ను మఠానికి తీసుకువచ్చారు. అప్పటికే ఆయన సైన్స్ గ్రాడ్యుయేట్. ఆపై 23 ఏళ్ల వయసులోనే సన్యాసం ఇప్పించి ఆదిత్యనాథ్ గా నామకరణం చేశారు. 1994లో తన వారసుడిగా ఆయన పేరును ప్రకటించారు. ఆపై 1997లో గోరఖ్ పూర్ ప్రాంతంలోని రెండు ప్రధాన ఆధిపత్య కులాలైన బ్రాహ్మణులు, ఠాకూర్ల మధ్య ఏర్పడిన గొడవల్లో ఠాకూర్ల నేత చనిపోవడంతో, ఆదిత్యనాథ్ మఠం బాధ్యతలను స్వీకరించి, 1998లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఆపై వరుసగా మరో నాలుగు సార్లు గెలిచి, ఆ ప్రాంతంలో తిరుగులేని నేతగా అవతరించారు.