: డిగ్రీలు పట్టుకోవాల్సిన అమ్మాయిల చేతుల్లో పసిపిల్లలు... 18 ఏళ్లలోపే తల్లులవుతున్న వైనం.. ఇందులో తెలుగురాష్ట్రాలే టాప్!
బాల్య వివాహాలు, చిన్న వయసులోనే తల్లులవుతున్న వారిపై కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. డిగ్రీలు చదవాల్సిన వయసులో తల్లులవుతున్న వారి శాతం ఏపీలో అత్యధికంగా ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. జేఎఫ్కే అనే ప్రైవేటు సంస్థతో జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సర్వే చేయించగా, తెలంగాణలో 10.6 శాతం మంది, ఏపీలో 11.8 శాతం మంది 18 ఏళ్లలోపు తల్లులయ్యారని, ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఏజన్సీ గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉందని తేలింది.
రెండు రాష్ట్రాల్లోను మాతా శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని పేర్కొంది. హైదరాబాద్ లో ప్రతి 100 మంది గర్భిణీ స్త్రీలలో ఐదుగురు చిన్న వయసువారేనని వెల్లడించింది. తమ సర్వేలో భాగంగా ఏపీలో 10,428 మందిని, తెలంగాణలో 7,567 మందిని ప్రశ్నించామని జేఎఫ్కే తెలియజేసింది. తల్లిదండ్రుల్లో సరైన అవగాహన లేకపోవడం, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి కారణాలతో 18 ఏళ్లు నిండకుండానే తల్లులవుతున్న వారి సంఖ్య ప్రమాదకరంగా ఉందని తెలిపింది.