: జానారెడ్డి ‘బాహుబలి’పై పేలుతున్న జోకులు
సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన ‘బాహుబలి’ వ్యాఖ్యలపై జోకులు మీద జోకులు పేలుతున్నాయి. ఇక అసెంబ్లీ లాబీలో శనివారం ఎక్కడ చూసినా ఇదే చర్చ నడిచింది. ఏ ఇద్దరు నాయకులు కలిసినా జనారెడ్డి ‘బాహుబలి’ గురించి చర్చించుకోవడం కనిపించింది. బాహుబలి ఎవరో, ఎక్కడి నుంచో రాడని, తమలో నుంచే బాహబలి వస్తాడని జానారెడ్డి విలేకరులతో చెబుతూనే తన అంతరార్థాన్ని గ్రహించారేమోనని అనుకుంటున్నానంటూ పజిల్ విసిరారు. బాహుబలి ఎక్కడి నుంచో వస్తాడని తాను చెప్పలేదని, కాంగ్రెస్ నుంచే వస్తాడని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైనా బాహుబలి కావచ్చని, ప్రతిఒక్కరు బాహుబలిలా వూహించుకున్నా తప్పేమీ లేదని జానారెడ్డి పేర్కొన్నారు. అలాగైతే అప్పుడు విజయం తమనే వరిస్తుందన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ బాహుబలి జానారెడ్డేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది బాహుబలులు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ కట్టప్పలాంటి కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ నుంచి ఒకరు బాహుబలి అవుతారని పేర్కొన్నారు. మొదటి భాగంలో వెన్నుపోటు పొడిచిన కట్టప్ప చరిత్ర రెండో భాగంలో ముగిసిపోతుందని అరుణ పేర్కొన్నారు.