: కోహ్లీని ఎద్దేవా చేసిన గ్లెన్ మ్యాక్స్ వెల్!
కోహ్లీని సరదాగా ఆసీస్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎద్దేవా చేశాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో తొలిరోజు ఫీల్డింగ్ సందర్భంగా డైవ్ చేసిన కోహ్లీ సరైన దిశలో దూకకపోవడంతో నియంత్రణ కోల్పోయి గాయపడ్డ సంగతి తెలిసిందే. తరువాత ఫీల్డ్ లోకి కోహ్లీ రాలేదు. బ్యాటింగ్ కు వచ్చినా పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో స్మిత్ కొట్టిన షాట్ ను తలపించేలా టీమిండియా జూనియర్ మిస్టర్ డిపెండబుల్ ఛటేశ్వర్ పుజారా ఫ్లిక్ చేసిన బంతిని ఆపేందుకు కమ్మిన్స్, మ్యాక్స్ వెల్ దూసుకెళ్లారు. కమ్మిన్స్ దానిని ఆపడం సాధ్యం కాదని ఆగిపోగా, మరింత వేగంగా వెళ్లిన మ్యాక్స్ వెల్ బౌండరీ లైన్ కు అడుగు దూరంలో డైవ్ చేసి ఆపేశాడు. అది సరిగ్గా కోహ్లీ గాయపడిన స్థానం! బంతిని ఫీల్డర్ కు పాస్ చేసిన మ్యాక్స్ వెల్ వెనుదిరిగి వస్తూ... భుజం పట్టుకుని కోహ్లీని ఎద్దేవా చేస్తూ అనుకరించాడు. తరువాత నవ్వేసి తన స్థానానికి వెళ్లిపోయాడు.