: అమెరికాలో భారతీయుడిపై దాడి.. ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
అమెరికాలో మరో జాతి విద్వేష దాడి జరిగింది. అయితే ఐదు నెలల ముందు జరిగిన ఈ దాడి తాజాగా వెలుగులోకొచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ గెలిచిన కొన్ని రోజులకే భారత సంతతికి చెందిన అంకుర్ మోహతా అనే వ్యక్తిపై ఓ అమెరికన్ దాడి చేశాడు. దీంతో ఆయన మెహతా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. జెఫ్రీ అల్లెన్ బర్గీస్(54) అనే పెన్సిల్వేనియాకు చెందిన వ్యక్తి సౌత్ హిల్స్ లో గత నవంబర్ 22న రెడ్ రాబిన్ రెస్టారెంట్ కు వెళ్లగా అంకుర్ మోహతా కూడా అదే రెస్టారెంట్ కు వెళ్లాడు.
అయితే, బర్గీస్ పక్క సీట్లో ఆయన కూర్చోవడంతో ఆ వ్యక్తి మెహతాను ముస్లిం అనుకుని తిట్టాడు. ఇక ముస్లింలు అమెరికాలో ఉండకూడదంటూ విద్వేషాన్ని కక్కుతూ పదునైన వస్తువుతో దాడిచేశాడు. ఈ దాడిలో మెహతా ఓ దంతం ఊడిపోయి, రక్తం కారింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంకుర్ మెహతాను బర్గీస్ తిడుతూ కొట్టడం చూసినట్లు ప్రత్యక్షసాక్షులు ఇచ్చిన సాక్ష్యంతో బర్గీస్ తప్పుచేశాడని, ఉద్దేశపూర్వకంగానే జాతి విద్వేష దాడి చేశాడని కోర్టు పేర్కొంది. ఆయనకు పదేళ్ల జైలుశిక్ష సహా 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.