: అదృశ్యమైన ఆ ఐదుగురు బాలికలను హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు
హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన ఐదుగురు ఏడో తరగతి విద్యార్థినులు మొన్న సాయంత్రం అదృశ్యం కాగా, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారి ఆచూకీని కనుగొన్న విషయం తెలిసిందే. ఈ రోజు వారిని పోలీసులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఆ విద్యార్థినుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా వారు విశాఖపట్నంలోని ఓ పార్కులో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వారు విశాఖపట్నంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారని, పరీక్షలు ముగియడం వల్ల వారంతా విహార యాత్ర కోసమే అక్కడకు వెళ్లారని చెప్పారు.
కాగా, అంబర్‌పేట్‌లో ప్రగతి విద్యానికేతన్‌లో ఏడో తరగతి చదువుతున్న సంగీత(12), ప్రీతి(12), నందిని(12), శ్రీనిధి(12), ప్రతిభ(12) అనే అమ్మాయిలు కనిపించకుండా పోవడంతో మూడు రోజులుగా వారి తల్లిదండ్రులు తీవ్రంగా కంగారు పడ్డారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు వారి ఆచూకీ కోసం ఆరా తీశారు.