: వైట్‌హౌస్‌లో ఉంటే ట్రంప్ కు ప్రమాదమే: అమెరికా సీక్రెట్ సర్వీస్ మాజీ ఏజెంట్ హెచ్చరిక
ఇటీవల ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ గోడ దూకి అత్యధిక భద్రత ఉండే ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడే సుమారు 15 నిమిషాల పాటు తిరిగాడు. అతడిని గుర్తించిన అధికారులు చివరకు అరెస్ట్ చేశారు. అయితే, ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ మాజీ ఏజెంట్ డాన్ బోంగినో పలు హెచ్చరికలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌కు శ్వేతసౌధం సురక్షితం కాదని అన్నారు.
ఉగ్రవాద దాడి జరిగితే చివరికి సీక్రెట్ సర్వీస్ కూడా ఆయనను కాపాడలేదని హెచ్చరించారు. అధ్యక్షుడిని కాపాడాల్సిన బాధ్యత సీక్రెట్ సర్వీస్‌పై ఉందని పేర్కొన్న ఆయన... వారికి సరైన సిబ్బంది ఉండడం లేదని అన్నారు. ఒకవేళ వైట్‌హౌస్‌పై నలభై మంది ఉగ్రవాదులు దాడి చేస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాను చెప్పేది నమ్మాలని, ఉగ్రవాదులు ఇప్పటికే దాని గురించి ఆలోచిస్తున్నారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
కాగా ఇటీవల శ్వేతసౌధంలోకి ప్రవేశించిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ టీ ట్రాన్(26)గా అధికారులు గుర్తించారు. అతడు రాత్రి 11.21 సమయంలో ప్రవేశించగా 11.38కి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అక్కడ ఉంటున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇలా జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు ట్రంప్ టవర్‌కు సంబంధించిన ఓ ల్యాప్‌టాప్‌ను దుండగులు చోరీచేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.