: అగ్రకులస్తులపై హోలీ రంగులు చల్లాడని కొట్టిన పోలీసులు.. దళితుడు మృతి
అగ్రకులస్తులపై హోలీ రంగులు చల్లాడని ఓ వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొదెర్మ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి తమ గ్రామస్తులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకుంటుండగా అటుగా వచ్చిన అగ్రకులస్తుడయిన చౌకీదార్ రాజేంద్ర యాదవ్‌పై కూడా రంగులు చల్లారు. తక్కువ కులంవారు తనపై రంగులు చల్లుతారా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన రాజేంద్ర దళితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ గ్రామానికి వచ్చిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్పృహతప్పి పడిపోయే వరకూ కొట్టి అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పోలీస్‌స్టేషన్‌లో ప్రదీప్‌ను చూసేందుకు అతడి భార్యకు కూడా అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా పోలీసులు తమను కులం పేరిట దూషించారని ప్రదీప్ భార్య చెప్పింది. అయితే, మరుసటి రోజు ప్రదీప్‌ను పోలీసులు ఇంటి వద్ద వదిలేశారని, గాయాలతో ఉన్న ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.