: అధ్యాపకురాలితో ప్రేమ విఫలం... డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య!
అధ్యాపకురాలితో ఓ విద్యార్థి సాగించిన ప్రేమాయణం అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఖమ్మం జిల్లా బోనకల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని గమనించిన రైల్వే పోలీసులు అక్కడ లభించిన ఆత్మహత్య లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకొని పలు వివరాలు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన మోర్ల వెంకటసాయి (18) ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సర విద్యార్థి అని, అతడు గతంలో చదివిన కాలేజీలో ఓ అధ్యాపకురాలితో సన్నిహితంగా ఉండేవాడని చెప్పారు. ఆమెపై కవితలు కూడా రాస్తూ ఉన్నాడని, అయితే, మూడు రోజుల క్రితం ఆ అధ్యాపకురాలి కుటుంబ సభ్యులు సాయిని పిలిచి నిర్బంధించారని పోలీసులు తెలిపారు. తర్వాత అతడిని హెచ్చరించి పంపేశారని చెప్పారు.
అయితే, తన కొడుకు వ్యవహారాన్ని తెలుసుకున్న సాయి తండ్రి, అతడిని కృష్ణాజిల్లా రోళ్లపాడు గ్రామంలో ఆ యువకుడి మేనమామ ఇంట్లో ఉంచాడని పోలీసులు అన్నారు. అయితే, రెండు రోజుల క్రితం సాయి అక్కడి నుంచి బోనకల్కు వచ్చేశాడని, రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆ అధ్యాపకురాలి కుటుంబ సభ్యులు తన కుమారుడిని వేధించారని అన్నారు. తమ కుమారుడు రాసిన ఆత్మహత్య లేఖలో అధ్యాపకురాలితో తన ప్రేమ, పరిచయాలను రాశాడని ఆయన చెప్పారు. చివరికి తనపై సైకో అనే ముద్రవేశారని తన కుమారుడు ఆ లేఖలో రాసినట్లు తెలిపారు.