: ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల్లో భేదాభిప్రాయాలు తీసుకురాకండి!: రుణమాఫీ విమర్శలపై ఘాటుగా స్పందించిన వెంకయ్య నాయుడు
'ఉత్తరప్రదేశ్ లో రైతు రుణమాఫీ విమర్శల'పై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందించారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాలను పట్టించుకోకుండా ఆ రాష్ట్రానికి కేంద్రం అటువంటి ప్రకటన చేయడం ఏంటంటూ పలువురు నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ రోజు వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ... యూపీలో రైతు రుణమాఫీ ప్రకటనకూ, కేంద్ర ప్రభుత్వానికీ ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వనరులను బట్టి ఆయా రాష్ట్రాలే రుణమాఫీ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఈ విషయంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల్లో భేదాభిప్రాయాలు తీసుకురాకూడదని ఆయన సూచించారు.