: ఐడియా నుంచి మరో ఆఫర్.. ఏ ‘జీ’ అయినా ఇక ఒకటే రేటు
టెలికం రంగంలో నెలకొన్న విపరీత పోటీని తట్టుకునేందుకు నెట్‌వర్క్ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఐడియా సెల్యులార్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. 2జీ, 3జీ, 4జీ అనే భేదం లేకుండా ఏ సేవనైనా ఒకే ధరకు అందించాలని నిర్ణయించింది. అయితే 1జీబీ, అంతకంటే తక్కువ డేటాను రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పటి వరకు వివిధ డేటా ప్యాక్‌లకు వివిధ చార్జీలు వసూలు చేస్తున్న ఐడియా ఇక నుంచి అన్నింటికీ ఒకే ధర వసూలు చేయాలని నిర్ణయించింది. ఈనెలాఖరు నుంచే దీనిని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రూ.170 రీచార్జ్‌తో 1జీబీ 2జీ సేవలు పొందవచ్చు. అదే సమయంలో 1జీబీ 4జీ డేటాకు రూ.123 వసూలు చేస్తోంది. దీంతో ఈ వ్యత్యాసాన్ని నివారించేందుకు అన్ని ప్యాక్‌లకు ఒకే చార్జీని వసూలు చేయాలని నిర్ణయించింది.