: బీజేపీ అలా భావించడం ప్రమాదకరం... మరి గోవా, పంజాబ్, మణిపూర్ లో ఏమైంది?: ప్రొఫెసర్ ప్రశ్న
ఉత్తరప్రదేశ్ లో వచ్చిన ఫలితాలను చూసి, కేంద్రంలో తమ ప్రభుత్వ విధానాలకు అవి ప్రతిఫలమని బీజేపీ భావించడం సరికాదని ప్రొఫెసర్ భరత్ ఝన్ ఝన్ వాలా సూచించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తన తాజా ఫలితాలను తమ విధానాలకు జనామోదంగా భావిస్తే ప్రమాదమేనని అన్నారు. బీజేపీ నేతల వాదనలో ఇదే భావం వినిపిస్తోందని చెప్పిన ఆయన...వారి వాదనే నిజమైతే గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచి ఉండాలని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పని చేసిందని అన్నారు. అలాగే ఉత్తరాఖండ్ వివాదాల నేపథ్యంలో అధికార మార్పిడిని ప్రజలు కోరుకున్నారని ఆయన పేర్కొన్నారు.
అలాగే పంజాబ్, గోవా, మణిపూర్ లలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటే పని చేసిందని, అయితే అది యూపీ అంత స్పష్టంగా లేదని ఆయన గుర్తుచేశారు. వాస్తవానికి మేకిన్ ఇండియా, జన్ ధన్ యోజన, నోట్ల రద్దు తదితర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు విఫలమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. జన్ ధన్ యోజనలో మునుపటి మాదిరిగా పేదలకు బ్యాంకులు రుణాలివ్వడం లేదని ఆయన విమర్శించారు. పైగా ఆ ఖాతాల్లోని పేదల సొమ్ము 20 వేల కోట్లు మళ్లీ బడాబాబులకు రుణాల రూపంలో అందుతోందని ఆయన తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం క్యాన్సర్ పేషెంట్ కు నొప్పి మాత్ర ఇచ్చినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నయం కాని జబ్బు వల్ల నొప్పి మళ్లీ తిరగబెట్టినట్టు మళ్లీ నల్లధనం పోగుపడిందని ఆయన తెలిపారు.