: కథకు ఎవరు ముగింపునిస్తే వారే బాహుబలి!: కాంగ్రెస్ నేత జానారెడ్డి
తెలంగాణ బడ్జెట్ సహా, సమకాలీన రాజకీయాలపై ప్రతిపక్ష నేత జానారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ప్రజల్ని మరోసారి ఆశల్లో ముంచిన అధికార పార్టీ టీఆర్ఎస్, సాధారణ ఎన్నికలకు వెళ్లేలా పార్టీ ప్రణాళికను సిద్ధం చేసుకుందని అన్నారు. 'ఎన్నికల నాటికి బాహుబలి వస్తారని, తమ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తారని, అయినా కథకు ఎవరు ముగింపు నిస్తే వారే బాహుబలి' అంటూ జానారెడ్డి తన దైన శైలిలో విశ్లేషించారు.
ఆదర్శ రాజకీయాలకు తాను విత్తనం లాంటి వాడినని చెప్పిన జానా రెడ్డి, ఆ విత్తనాన్ని కాపాడుకుంటే ఆ తర్వాత ఎంతైనా పంట పండించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలు, విద్యుత్ రంగ సంస్థలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం గురించి ఆయన ప్రస్తావించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ప్రారంభించి, నమూనా ఇళ్లను చూపి టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తుందని, కాంట్రాక్టర్లను పిలిచి కొన్ని ఇళ్లు అయినా నిర్మించాలని బతిమిలాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఏ ఒక్క లబ్దిదారుడికి ఇల్లు ఇవ్వరని, ఆశల్లో ముంచి ప్రజల ఓట్లు అడుగుతారని జానారెడ్డి విమర్శించారు.