: రాహుల్ గాంధీపై కేసుకు గోవా బీజేపీ కసరత్తు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు గోవా బీజేపీ కసరత్తులు చేస్తోంది. తాజాగా గోవాలో ఎన్నికల ఫలితాల అనంతరం 13 స్థానాలు సాధించిన బీజేపీ అధికారం చేపట్టడంపై గోవా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిరీశ్ చోదంకర్ తో పాటు రాహుల్ గాంధీ పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో గోవాలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెసేతర పార్టీలకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు బీజేపీ ఇచ్చిందని ఆరోపణలు చేశారు.
దీనిపై రాహుల్ గాంధీతో పాటు గిరీశ్ చదంకర్ పై పరువునష్టం కేసులు దాఖలు చేయాలని, ఈ మేరకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించిన లీగల్ నోటీసు డ్రాఫ్ట్ ను తయారుచేసే పనిలో గోవా బీజేపీ ప్రెసిడెంట్ వినయ్ టెండూల్కర్ బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ తమపై లేనిపోని ఆరోపణలు చేసిందని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగే వ్యాఖ్యలు చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో ఆ పార్టీపై పరువు నష్టం కేసులు దాఖలు చేయనున్నామని ఆయన తెలిపారు.