: 'నేను దర్శకత్వం వహించాల్సిన అవసరం ఉందా?' అంటూ సీక్రెట్ రివీల్ చేసిన చిరంజీవి!
'కేవలం నటనకు మాత్రమే పరిమితమవుతారా? లేక భవిష్యత్ లో దర్శకత్వం వహిస్తారా?' అంటూ టీవీ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిని నటి రంభ ప్రశ్నించింది. 40 ఏళ్ల అనుభవంతో ఓ మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందా? అని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన చిరంజీవి ఒక సీక్రెట్ ను రివీల్ చేశారు. తన ప్రతి సినిమా విషయంలోనూ కథా చర్చల దగర్నుంచి, సంభాషణల్లోను, ప్రతి సన్నివేశంలోను తన సూచనలు, సలహాలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు తాను కొత్తగా దర్శకత్వం వహించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇన్ని సినిమాల్లో తాను అన్నీ చేశానని, కొత్తగా దర్శకత్వం చేయాల్సిన అవసరం లేదని చెప్పిన చిరంజీవి... 'పోనీ నువ్వు చెప్పు.. నేను కొత్తగా దర్శకత్వం వహించాల్సిన అవసరం ఉందా?' అని అడిగారు. దీనికి రంభ నవ్వేసింది. తన హీరోయిన్స్ లో రాధ, రంభ మంచి డాన్సర్స్ అని చిరంజీవి తెలిపారు. తాను ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తానని, అందుకే ఆనందంగా ఉంటానని ఆయన చెప్పారు. ఒకవేళ తన మూడ్ బాగా లేకపోతే తన కుటుంబం మొత్తం మూడాఫ్ లో ఉంటుందని అన్నారు. అందుకే తాను మూడ్ బాగుండేలా చూసుకుంటానని, తన నవ్వుకు కారణం ప్రతిక్షణం ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడమేనని ఆయన చెప్పారు.