: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడితో నాకు ప్రాణహాని ఉంది: అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడితో తనకు ప్రాణహాని ఉందని ఏపీ అసెంబ్లీ ముందు ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కల్యాణి అనే మహిళ ఆరోపించింది. శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆమె ఆందోళనకు దిగింది. తనకు జీతం రావడం లేదని మంత్రి అచ్చెన్నాయుడిని కలిస్తే తనను బూటుతో తన్ని అవమానించారని ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయాలని కల్యాణి డిమాండ్ చేసింది. కాగా, గత మంగళవారం రోజున ఏపీ అసెంబ్లీ ఎదుట కల్యాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తర్వాత ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో కల్యాణిని ఆమె స్వస్థలానికి పంపివేశారు.
ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు సేకరించిన వివరాల ప్రకారం.. కల్యాణి తండ్రి కూరపాని అప్పారావు ఆర్ అండ్ బీ శాఖలో రోడ్ రోలర్ డ్రైవర్ గా పని చేస్తూ మృతి చెందాడు. అదే శాఖలో ఆమెకు అటెండర్ గా ఉద్యోగం ఇచ్చారు. అయితే, పదోన్నతి నిమిత్తం ఉన్నతాధికారులను ఆమె ఇటీవల కలిశారు. ఈ క్రమంలో తన పదో తరగతి సర్టిఫికెట్ నకిలీదని ఆరోపిస్తూ, ఆమెపై ఆర్ అండ్ బీ అధికారులు కేసు పెట్టారు. దీంతో, ఆమెకు ప్రతి నెలా వచ్చే జీతం ఆగిపోయింది. ఆమెపై ఆర్ అండ్ బీ అధికారులు, పోలీసుల వేధింపులు ఎక్కువై పోయాయి. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు మంత్రి అచ్చెన్నాయుడిని కలిస్తే, ఆయన తనను బూటుతో తన్ని అవమానించారని ఆమె ఆరోపించింది. ఈ విషయమై చంద్రబాబుకు చెప్పాలనుకుంటే, సిబ్బంది తనను అనుమతించలేదని, దీంతో, తాను ఆత్మహత్యాయత్నం చేశానని మీడియా ప్రతినిధులతో కల్యాణి పేర్కొనడం గమనార్హం.