: సుప్రీం జారీ చేసిన అరెస్టు వారెంట్ ను సైతం తిరస్కరించిన కలకత్తా హైకోర్టు జడ్జి
కోర్టు ధిక్కారణ వైఖరి కారణంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ పై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ ను జారీ చేయడంతో ఆయనకు వారెంటును అందజేయడానికి పశ్చిమ బెంగాల్ డీజీపీ వందమంది పోలీసులతో కలసి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, కర్ణన్ మరోసారి అదే తీరును కనబర్చారు. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ను ఆయన తీసుకోలేదు. ఈ సందర్భంగా ఆయన మరోసారి పలు వ్యాఖ్యలు చేశారు. తనకు వారెంట్ జారీ చేయడం చట్టవిరుద్ధమని, ఓ దళిత జడ్జిని వేధించడమేనని వ్యాఖ్యానించారు. తనపై వారెంట్ జారీ చేయడంతో సుప్రీంకోర్టు ప్రపంచం ముందు నవ్వుల పాలైందని అన్నారు. తాను న్యాయస్థానం ముందు ఎందుకు హాజరు కావాలని ఎదురు ప్రశ్నించారు. ఓ హైకోర్టు జడ్జిపై చర్యలు తీసుకునే అధికారం కేవలం పార్లమెంట్‌కే ఉంటుందని అన్నారు. కాగా, ఆయన ఈ నెల 31న విచారణకు హాజరు కావాల్సి ఉంది.