: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఇంటికి వంద మంది పోలీసులతో వెళ్లిన డీజీపీ!
విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆదేశాలనే పెడచెవిన పెట్టిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ పై న్యాయస్థానం కొన్ని రోజుల ముందు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు అరెస్ట్ వారెంటును వ్యక్తిగతంగా వెళ్లి అందజేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో కోర్టు జారీచేసిన బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అందజేయడానికి ఆ రాష్ట్ర డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఏకంగా వంద మంది పోలీసులతో కలిసి వెళ్లారు. ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇటీవలే తనకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడంపై స్పందించిన కర్ణన్ ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డ విషయం తెలిసిందే. అంతేగాక, ఆ అధికారం సుప్రీంకోర్టుకు లేదని కూడా ఆయన అన్నారు. తాను దళితుడనైనందుకే తనపై ఇలా ప్రవర్తిస్తున్నారని పలు వ్యాఖ్యలు చేశారు.