: రాహుల్ గాంధీ తన నిరాడంబరతతో మోదీని ఓడిస్తారు... యువరాజుపై రాజ్ బబ్బర్ విశ్వాసం
తమకు కొరకురాని కొయ్యలా మారి కూర్చున్న ప్రధాని మోదీని ఎలా ఓడించాలబ్బా అనుకుంటూ కాంగ్రెస్ అధిష్ఠానం తలపట్టుకుంటుంటే... ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మాత్రం యువరాజు సామర్థ్యంపై అమిత విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ తన నిరాడంబరతతోనే ప్రధాని మోదీని ఓడిస్తారని బబ్బర్ తేల్చేశారు.
ఇటీవలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ కలసి పోటీ చేసి దారుణ ఫలితాలను చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ యాదవ్ తో కలసి రాహుల్ కూడా ప్రచారం నిర్వహించారు. మరి రాహుల్ నిరాడంబర మంత్రం యూపీలో ఎందుకు పనిచేయలేదన్నది బబ్బర్ ఇంకా విశ్లేషించనట్టుంది. యూపీలో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించారు కూడా. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఓటమి నేపథ్యంలో పార్టీకి వ్యవస్థాపరంగా, నిర్మాణాత్మకంగా మార్పులు అవసరమని రాహుల్ గాంధీ సైతం ప్రకటించారు. కానీ, రాజ్ బబ్బర్ మాత్రం రాహుల్ గాంధీ నిరాడంబరతే కాంగ్రెస్ ను గెలిపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయడం ఆశ్చర్యం.