: సౌదీలో కడపవాసి నరకయాతన... సాయం కోసం ఎదురు చూపులు
పని కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన కడప జిల్లా యువకుడిపై అక్కడి యజమాని అమానుషంగా హింసకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులకు చెందిన లవంగిరి అన్సార్ బాషా (25). సౌదీ అరేబియాలోని మదీనాలో ఖాలేద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి దగ్గర కారు డ్రైవర్ గా ఏడాది నుంచి ఇతడు పనిచేస్తున్నాడు. ఓ రోజు అహ్మద్ భార్యను కారులో తీసుకెళ్లిన సమయంలో ల్యాప్ ట్యాప్ దెబ్బతింది. అందులో బాషా తప్పిదం ఏమీ లేకపోయినా యజమాని అతడిపై దాడి చేశాడు.
యజమాని చేతిలో చిత్రహింసలకు గురైన బాషా ప్రస్తుతం తీవ్ర జ్వరంతో స్నేహితుల గదిలో ఉన్నాడు. కనీసం డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. బాషాపై దాడికి పాల్పడిన యజమాని అతడి పాస్ పోర్ట్ సహా ఇతర డాక్యుమెంట్లన్నీ ధ్వంసం చేశాడు. తన పరిస్థితిని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సాయం లభించలేదు. పోలీసులను ఆశ్రయించాలని సలహా లభించింది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు కూడా పట్టించుకోవడం లేదు.