: ఈ చీకటి కోణాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు ధన్యవాదాలు : జయసుధ
ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు జయసుధ, నితిన్ కపూర్ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా జయసుధ తన భర్త గురించి ఫేస్బుక్లో స్పందిస్తూ... తన భర్త ఇప్పుడు దేవతలతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా తన భర్త వెతికిన శాంతి ఆయనకు ఇప్పుడు దొరికిందని ఆమె అన్నారు. డిప్రెషన్ అనేది ఎంతో తీవ్రమైన మెడికల్ కండిషన్ అని, తన జీవితంలోని ఈ చీకటి కోణాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు తన ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు. 32 ఏళ్ల కిత్రం ఇదే రోజు ఇద్దరం ఒకటయ్యామని పేర్కొన్నారు. తన భర్త సహచర్యంలో తాను గడిపిన మధుర క్షణాలు తనకు గుర్తుకొస్తున్నాయని అన్నారు.
తన భర్త ఎక్కడున్నా తమని కాపాడుతూనే ఉంటారని తనకు తెలుసని అన్నారు. తన భర్త ఆత్మకు శాంతి చేకూరాలని జయసుధ ప్రార్థించారు. తన భర్తను కోల్పోయిన విషాద సమయంలో తనకు, తన కుటుంబానికి మద్దతు ప్రకటించిన వారికి తన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు.