: రాంచీ టెస్టు ద్వారా మరో ఘనత సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌తో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఘనతను సాధించాడు. మ్యాక్స్ వెల్ మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమైన వేళ నేటి రెండో రోజు ఆటలోనూ స్మిత్ సెంచరీ సాధించి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆటలో ఆయన 130 పరుగుల వ్యక్తిగత స్కోరును దాటడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పాత రికార్డును బద్దలుకొట్టాడు.
2012-13 సీజన్ లో భారత్ లో క్లార్క్ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఆ రికార్డునే స్మిత్ దాటేశాడు. అంతేకాదు, భారత్ లో ఒక సిరీస్ లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన మూడో కెప్టెన్ గా కూడా ఘనత సాధించాడు. పుణెలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్మిత్ సెంచరీ చేశాడు. దీంతో గతంలో ఈ ఘనతను సాధించిన క్లైవ్ లాయిండ్(1974-75), అలెస్టర్ కుక్(2012-13)ల సరసన నిలిచాడు.