: పిల్లల కోసం ప్రాణాలకు తెగించిన ఉపాధ్యాయురాలు!
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ హైస్కూల్ ఉపాధ్యాయురాలు పి.మధు ధైర్యసాహసాలను స్థానికులంతా కొనియాడుతున్నారు. వివరాల్లోకి వెళితే, హైస్కూల్లోకి నిన్న 8 అడుగుల పొడవున్న నాగుపాము చొరబడింది. విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఈ పాము రావడంతో... పిల్లలు భయంతో వణికిపోయారు. తింటున్న కంచాలను వదిలేసి, ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. వెంటనే అక్కడకు వచ్చిన ఉపాధ్యాయురాలు మధు... తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పామును చంపేశారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే స్కూల్లో పాటు కాటుకు గురై ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి విషాద ఘటన పునరావృతం కాకుండా ఉండాలన్న భావనతో... తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పామును చంపేశారామె. దీంతో, అందరూ ఆమెను అభినందిస్తున్నారు.